Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శరవేగంగా మారుతున్న యూపీ రాజకీయాలు... ముందస్తు ఎన్నికలకు అఖిలేష్ ప్లాన్!

ఉత్తరప్రదేశ్ లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను సీఎం అఖిలేష్ తొలగించిన తరువాత రాష్ట్ర రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. కుమారుడు, ప్రభుత్వం కన్నా, తనకు ప్రియమైన సోదరుడు శివపాల్ యాదవ్ ముఖ్యమన్న సంకేతాలు, పార్టీ సుప్రీమ్ ములాయం సింగ్ యాదవ్ నుంచి వెలువడిన వేళ, వచ్చే సంవత్సరం జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలను ముందుగానే పెట్టించుకోవాలన్న ఆలోచనలో అఖిలేష్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ముందుగానే ఎన్నికలకు వెళితే, అవినీతి ఆరోపణలను తాను సహించబోనని, బాబాయ్ ని కూడా మంత్రి పదవి నుంచి తొలగించానని చెప్పుకోవచ్చని అఖిలేష్ భావిస్తున్నట్టు రాజకీయ వర్గాలు వెల్లడించాయి. ఇదే సమయంలో మరో ఏడాది ఆగితే, ఈ లోగా బీజేపీ పుంజుకోవచ్చని, దాంతో అధికంగా నష్టపోయేది సమాజ్ వాదీ పార్టీయేనని ఆయన ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. కాగా, ఈ ఉదయం శివపాల్ సింగ్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ, తాను నేతాజీ (ములాయం)తో మాట్లాడేందుకు ఢిల్లీకి వెళుతున్నానని, ఆయనతో చర్చించిన తరువాత తానో నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. ఓ ముఖ్యమంత్రిగా తనను తొలగించే హక్కు అఖిలేష్ యాదవ్ కు ఉందని తెలిపారు. తనకు సంబంధించినంత వరకూ ములాయం వెంటే ప్రజలున్నారని మంత్రి పదవికి రాజీనామా చేసి, యూపీ సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడిగా నియమితుడైన శివపాల్ తెలిపారు.

More Telugu News